జనగామ మార్కెట్లో మంత్రి ఆకస్మిక పర్యటన

రైతులకు అండగా నిలుస్తాం

> హరీశ్‌రావు సమక్షంలో కందుల కొనుగోలుకు అధికారుల పరిశీలన.. ఆపై నిలిపివేత
జనగామ: మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం జనగామ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించడంతో రెండు రోజులుగా తిప్పలు పడుతున్న రైతులకు ­రట లభించింది. ఎఫ్‌సీఐ, హాకా ఆధ్వర్యంలో జరగాల్సిన కొనుగోళ్లు అధికారులపై రైతుల ఆగ్రహం, ఘర్షణ వాతావరణం కారణంగా శుక్రవారం నిలిచిపోయాయి. యార్డులో కందులు, వేరుసెనగ రాశులు పేరుకుపోవడంతో శనివారం మార్కెట్‌కు సెలవు ప్రకటించి, అన్నదాతలను సరకులు తేవద్దని ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం వరకు మద్దతు ధరతో కందుల ఖరీదు జరిగే అవకాశాలు లేవనే ప్రచారంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో మంత్రి హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మార్కెట్‌యార్డును సందర్శించారు.
వచ్చీరాగానే: కొత్త పాలకవర్గం ఏర్పడిన అనంతరం తొలిసారి మార్కెటింగ్‌ మంత్రి వస్తున్నారనే సమాచారంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జేసీ గోపాలకృష్ణప్రసాదరావు, డీసీపీ వెంకన్న, ఏసీపీ పద్మనాభరెడ్డి, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ బి.పద్మ, మార్కెటింగ్‌ జిల్లా అధికారి నాగేశ్వరశర్మ, తెరాస పట్టణాధ్యక్షుడు బండయాదగిరిరెడ్డి తదితరులు ఆయనకు పూలబొకేలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ హరీశ్‌రావు కారు దిగీ దిగగానే, నేరుగా కళ్లాలను పరిశీలించారు. రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఎఫ్‌సీఐ అధికారులను వివరణ కోరారు. మార్కెటింగ్‌ అధికారులకు, జిల్లా జేసీకి సూచనలు చేశారు.
పరామర్శిస్తూ..పలకరిస్తూ:
మార్కెట్‌ కార్యాలయం ముందు కందులు పోసిన, యాదగిరిగుట్ట మండలం ఏదులగూడెంకు చెందిన ప్రమీల అనే రైతును పలకరించారు. సాగు, దిగుబడి వివరాలు అడిగారు. ­రు ఎక్కడ అంటే..యాదగిరిగుట్ట మండలం అని చెప్పారు. జిల్లా కూడా అదేనని సమాధానం ఇచ్చారు. ‘ఓహో..జిల్లాల ఏర్పాటు గురించి బాగానే తెల్సుకుని, గుర్తుంచుకున్నావు..’ అని అన్నారు. కందులను పరిశీలించి బాగున్నాయన్నారు. ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్‌ చక్రేశ్‌ఖురేలీతో మాట్లాడారు. బుధ,గురువారాల్లో జరిగిన సంఘటనల గురించి ఆయన వివరించారు.
జుట్టు దుమ్ముదుమ్మయ్యింది సార్‌..:
మరో కళ్లంలోకి వెళ్ళి మంత్రి కందులను పరిశీలించగా.. ‘సార్‌..మంగళవారం సరకులు తెచ్చాం..నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నాం..జుట్టు దుమ్ముదుమ్ము అయ్యింది సార్‌..అని లింగాలఘనపురం మండలం నేలపోగులకు చెందిన యువ రైతు బాషిపాక రాజు తన గోడు వివరించారు. రైతు కందగట్ల భాస్కర్‌ తమ సరకు కొనడం లేదని ఫిర్యాదు చేయగా, పరిశీలిచి..బాగానే ఉన్నాయిగా.’ కార్యదర్శి గారూ..వీరి సరకు కొనేందుకు చర్యలు తీసుకోండి’ అని మంత్రి ఆదేశించారు. అధికారులు మార్కెట్లో సమన్వయంతో పనిచేయాలని, నాణ్యమైన కందులకు మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. జిల్లా సంయుక్త అధికారి గోపాలకృష్ణప్రసాదరావును రోజూ మార్కెట్‌కు వచ్చి, కొనుగోలు ప్రక్రియ సవ్యంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
దండలు..శాలువలు వద్దు:
యార్డులో పరిశీలన అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ బండ పద్మ మంత్రికి పూలదండను సమర్పించబోగా, ఆయన నిరాకరించారు..మరో మంత్రి మహేందర్‌రెడ్డికి ఇవ్వమన్నారు. శాలువతో సత్కరించబోగా..సన్మానాలు వద్దని నిరాకరించి, ఛైర్‌పర్సన్‌కు కప్పారు.
మంత్రి వెళ్లగానే నిలిచిన ప్రక్రియ: మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌ పర్యటనకు వచ్చిన సమయంలో ఎఫ్‌సీఐ అధికారులు కందుల నాణ్యత పరిశీలన ప్రక్రియను ప్రారంభించారు. ఆయన వెళ్లగానే నిలిపివేశారు. మార్కెట్లో తమ అధికారులు, ఉద్యోగులపై జరిగిన దాడికి సంబంధించి జేసీతో చర్చలు జరిపేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు మంత్రి వెళ్లిన తదుపరి మధ్యాహ్నం 12.30 వరకు చర్చలు కొనసాగడంతో రైతులు అసహనానికి లోనయ్యారు. మహిళా రైతులు కార్యాలయానికి వెళ్లబోగా, పోలీసులు వారిని శాంతింపజేసి నిలువరించారు. మధ్యలో జేసీ బయటకు వచ్చి, ఎఫ్‌సీఐ అధికారులు, వారి సంఘం ప్రతినిధులతో చర్చిస్తున్నానని, కొద్దిసేపట్లో కొనుగోలు ప్రారంభమవుతుందని సర్దిచెప్పారు. ఎట్టకేలకు సుమారు ఒంటిగంట సమయంలో ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
పోలీసు బందోబస్తు మధ్య కొనుగోళ్లు:
మార్కెట్లో రైతుల ఆగ్రహం, అధికారులతో జగడాల నేపథ్యంలో ఇకపై ఈ ప్రక్రియ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తమపై రైతులు దాడి చేశారని, ఇకపై ‘సాయుధ పోలీసు రక్షణ’ కావాలని చర్చల సందర్భంగా ఎఫ్‌సీఐ యూనియన్‌ నాయకులు, అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా సాధారణ పోలీసు బందోబస్తు ఉంటుందని, అధికార యంత్రాంగం, మార్కెట్‌ కమిటీ సహకరిస్తుందని జేసీ గోపాలకృష్ణప్రసాద్‌ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు ఈ విషయంలో తమ సహకారం ఉంటుందని వివరించిన తర్వాతే..నల్లబాడ్జీలు ధరించి ఎఫ్‌సీఐ అధికారులు కందుల కొనుగోలు ప్రక్రియను కొనసాగించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'