ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ
>> మంత్రుల వూళ్లలో బహిరంగ సభలు
>> తెలంగాణ తెదేపా సమావేశంలో నిర్ణయాలు : రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : తెరాస ప్రజావ్యతిరేక పాలనపై నిరవధిక ప్రజా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఎల్.రమణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలుగుయువత అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, బోడ జనార్దన్‌లు విలేకరులకు వివరించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వస్తే నిజాం చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మౌనం వహించారని విమర్శించారు. తొలుత గజ్వేలులో సభ ప్రారంభించి, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మే 29న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. రెండు పడక గదుల ఇళ్లపై తెలుగు మహిళా విభాగం, బోధనా రుసుముల చెల్లింపుల పథకంపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్), నిరుద్యోగుల సమస్యలపై తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిందన్నారు. భాజపా కూడా సీఎం వేలు పట్టుకుని నడుస్తోందని ఆరోపించారు. గ్రామం నుంచి మండల స్థాయి వరకూ తెదేపా కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరేందర్‌గౌడ్ తెలిపారు.
>> తెలంగాణ తెదేపా సమావేశంలో నిర్ణయాలు : రేవంత్‌రెడ్డి
టీఎన్‌ఎస్‌ఎఫ్ రూపొందించిన కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను నేతలు ఆవిష్కరించారు. పార్టీ ముఖ్య నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రమేశ్ రాథోడ్, ఉమా మాధవరెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, సీతక్క, బండ్రు శోభారాణి, చిలుక మధుసూదన్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment