చేనేతకుపూర్వ వైభవం

చేనేతకుపూర్వ వైభవం

ఒకనాడు ఉజ్వలంగా వర్ధిల్లిన చేనేతకు పూర్వవైభవం సాధించడంతోపాటు చేనేత వృత్తిదారులైన పద్మశాలి, ఉపకులాల వారిని ఆదుకోవటం కోసం కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం మాదిరిగానే చేనేత రంగాభివృద్ధికి కూడా విప్లవాత్మక కార్యాచరణ చేపడుతామని సీఎం ప్రకటించారు. 

హైదరాబాద్

మంత్రి కేటీఆర్‌తో పాటు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, సమాచార శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితాసబర్వాల్, శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
:చేనేత వృత్తిమీద ఆధారపడి జీవిస్తున్న పద్మశాలి, ఉపకులాల సముద్ధరణ కోసం కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ రంగాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని చెప్పారు.తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కంకణబద్ధమై పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. యాదవులు, గొల్లకుర్మల కోసం గొర్రెల పెంపకం, ముదిరాజ్, బెస్తలు, గంగపుత్రుల కోసం చేపల పెంపకంలో విప్లవాత్మక కార్యాచరణ చేపడుతున్నామని, అదేరీతిలో చేనేత రంగంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే కార్యాచరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. చేనేత రంగంలో చేపట్టాల్సిన చర్యలపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మార్పులకు అనుగుణంగా.. 


సమస్యల్లో చిక్కుకున్న చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు కార్మికులను కాపాడుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ, ఇండస్ట్రీస్, హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి కే తారకరామారావుకు సీఎం సూచించారు. ఏ రకమైన సహకారం అందిస్తే వృత్తిదారులకు మేలు జరుగుతుందో అధ్యయనం చేయాలని అధికారులను అదేశించారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా చేనేత ఉత్పత్తులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. 

పునర్నిర్మాణంలో కులవృత్తుల ఉద్ధరణ.. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గత ప్రభుత్వాలు తెలంగాణ వెనుకబడిన కులాలను, వృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం అన్నారు. అనేక బీసీ కులాలతో పాటు పద్మశాలీలు, వారి కుల వృత్తులను విస్మరించారని, ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్యలకు పాల్పడేందుకు కారణమయ్యారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ తనను తాను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో కార్యాచరణ తీసుకుంటున్నదని అన్నారు. ఈ క్రమంలో అధికారుల ఆలోచనలు, కార్యాచరణ కూడా తెలంగాణ దృక్కోణంలో వినూత్నంగా ఉండాలని ఉద్బోధించారు. చేనేతకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. వివిధ చేనేత ఉత్పత్తుల వివరాలు, సిరిసిల్ల, నల్ల గొండ, వరంగల్‌సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత మగ్గాలు, మరమగ్గాలు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారుల సంఖ్య పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. 

వారు స్వయం సమృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఎంతమేర సహాయం చేయాలనేదానిపై సూచనలు తీసుకున్నారు. చేనేతవస్త్రాల తయారీలో ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వస్త్రాల ఉత్పత్తి ఇపుడు ఎక్కడెక్కడ కొనసాగుతున్నది? ప్రత్యేకతను చాటుతున్న కొన్ని చేనేత కళారూపాలను రక్షించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ వల్ల లభించే ఉపాధి విస్తృతి ఎంత? వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సూరత్, ముంబై ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కుటుంబాలను రప్పించి ఉపాధి కల్పించటంతో పాటు చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు ఎన్ని నిధులు అవసరం? అనే అంశాలు పరిశీలించారు. చర్చించిన అంశాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని సీఎం ఆదేశించారు

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'