రైతుల పట్టాదారు పాస్‌బుక్కులన్నీ రద్దు
> నకిలీలతో వేలకోట్లు పక్కదారి
> ఆర్‌బీఐ సూచనతో సర్కారు నిర్ణయం
> 82 లక్షల పుస్తకాల మార్పిడి
> రెండు నెలల్లో కొత్త పుస్తకాలు జారీ!
కొత్త వాటి తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం
ఏటా ప్రభుత్వం, బ్యాంకులకు రూ.1000 కోట్ల చొప్పున మిగులు
AMR NEWS TELANGANA /
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పరంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పాస్‌బుక్‌లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. నకిలీపాస్ బుక్‌లతో వేలకోట్ల రుణం పక్కదారి పడుతోందని బ్యాంకర్లు గగ్గోలు పెట్టడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న 82 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రతియేటా రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలను పొందుతుంటారు. కొందరు భూమి మార్టిగేజ్ కిందా రుణాలు తీసుకుంటారు. ఇందుకు వారు పూచీకత్తుగా బ్యాంకుల్లో పట్టాదారు పాసు పుస్తకాలను పెట్టాల్సి ఉంటుంది. అయితే రైతుల ముసుగులో కొందరు నకిలీ పాస్‌పుస్తకాలను పుట్టిస్తున్నారని, వాటిని బ్యాంకుల్లో పెట్టి వేలకు వేలు రుణాల రూపంలో స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతులకు ప్రభుత్వం ఇచ్చే విత్తన, ఎరువుల సబ్సిడీ కూడా పక్కదారి పడుతోందని, వీటికి ప్రధాన కారణం నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలే అని అధికారులు తేల్చారు. కాగా పట్టాదారు పాస్‌పుస్తకాలన్నీ రద్దు చేయాలని మూడువారాల కిందటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ), నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు. రెండువారాలుగా కొత్త పాస్ పుస్తకాల జారీ ప్రక్రియపై ముద్రణాలయం ప్రతినిధులతో మీసేవ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
అత్యాధునిక సాంకేతికతో ‘నకిలీ’కి చెక్
నకిలీ పాస్‌బుక్‌లకు చెక్‌పెట్టేందుకుగాను కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పూర్తి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించనున్నారు. ఈ మేరకు సాంకేతిక పరమైన 18కి పైగా అంశాలతో కూడిన పాసు పుస్తకాలను జారీ చేయనున్నారు. ఒక్కో పాస్‌పుస్తకం/టైటిల్ డీడ్‌కు రూ.150ల దాకా రైతుల నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా ఈ పాస్‌పుస్తకాలు జారీ కానున్నాయి. ఇప్పుడున్న పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి, కొత్తవి జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.1000 కోట్ల దాకా నిధులు, బ్యాంకుల నుంచి రుణం రూపంలో మరో రూ.1000 కోట్లు అక్రమార్కుల చేతుల్లో పడకుండా నివారించవచ్చునని భావిస్తున్నారు. దీంతో పాస్‌బుక్‌లను ఉచితంగా జారీ చేసినా ప్రభుత్వానికి మేలే జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏటా రూ.1000 కోట్ల దాకా నకిలీ రైతుల జేబుల్లోకి పోతున్నాయని, పాస్‌పుస్తకాలు రద్దు చేస్తే ఈ నిధులన్నీ మిగిలినట్లే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
పొరుగు రాష్ట్రంలో మరో విధానం
పొరుగు రాష్ట్రం ఏపీలో రైతాంగానికి మూడేళ్లుగా కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్నారు. అయితే అక్కడి రైతులు బ్యాంకు రుణాలకు పాస్‌పుస్తకాలు ఇవ్వాల్సిన పనిలేకుండా ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వెబ్‌ల్యాండ్‌లోని నవీకరించిన డేటా 1(బీ) సర్టిఫికెట్ ఆధారంగా రుణాలిస్తున్నారు. బ్యాంకర్లే నేరుగా వెబ్‌ల్యాండ్‌లోకి వెళ్లి 1(బీ) సర్టిఫికెట్ డౌనలోడ్ చేసుకొని రైతులకు రుణం ఇవ్వవచ్చు.
Comments
Post a Comment