అమెరికా అమెరికన్లదే!
అమెరికా అమెరికన్లదే!
ట్రంప్ ఉద్ఘాటన.. అధ్యక్షుడిగా ప్రమాణం
మన అమెరికాను పునర్నిర్మిద్దాం
ఇకపై దేశానికే తొలి ప్రాధాన్యం
అమెరికన్లకు లాభం చేసే నిర్ణయాలే
ఇక్కడి ప్రజలే పాలకులైన రోజు ఇది
రాజధాని అధికారం వారికే బదిలీ
ఉగ్రవాదానికి భూమిపై చోటులేదు
నా పాలనను ఇతర దేశాలపై రుద్దను
జాతిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్:ప్రపంచాన్ని కమ్ముకుంటున్న ప్రగాఢ జాతీయ వాదానికి ‘అగ్ర’ ప్రతీక.. నవ అమెరికా యువతరం కలల ఆశాదీపిక... అందరి అమెరికా ఇక అమెరికన్లది మాత్రమే అని ఉద్ఘాటిస్తున్న కొత్త గొంతుక.. సరికొత్త శకానికి ఆరంభ సూచిక.. వివాదాల వీచిక.. డోనాల్డ్ ట్రంప్.. ఇక ప్రెసిడెంట్ అఫ్ అమెరికా!! ఉద్రిక్తంగా, ఉత్కంఠభరితంగా, ఉద్వేగపూరితంగా జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించిన ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వివాదాస్పద విధానాల నుంచి ఏ మాత్రం వెనక్కు తగ్గేదిలేదని పునరుద్ఘాటిస్తూ... తొలి రోజు నుంచే మార్పును ప్రకటిస్తూ.. తన శకాన్ని ప్రారంభించారు. ఒబామాతో పోలిస్తే ప్రమాణ స్వీకారానికి హాజరైన జనం తక్కువే అయినా మారిన వాతావరణంలో అది మహోత్సాహంగా సాగింది. అదే సమయంలో అమెరికాలోనే చరిత్రలోనే అరుదైన రీతిలో.. అధ్యక్షుడికి వ్యతిరేక ప్రదర్శనలూ ‘ఘనంగానే’ స్వాగతం పలికాయి.
అమెరికా అమెరికన్లదే అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ల చేతుల మీదుగానే దేశాన్ని పునర్నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అందరం కలిసికట్టుగా మరోసారి దేశాన్ని బలోపేతం చేద్దామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇక దేశమే తొలి ప్రాధాన్యం కావాలని, అమెరికా గమ్యాన్ని అందరం కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. చల్లని వాతావరణంలో, దాదాపు 8 లక్షలమంది అమెరికన్ల సమక్షంలో, భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (70) ప్రమాణ స్వీకారం చేశారు.
తన తల్లి ఇచ్చిన.. 150 ఏళ్ల కిందట అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేసిన రెండు బైబిళ్లపైనా ఎడమ చేతిని వేసి, ‘అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతానని, రక్షిస్తానని’ ఆయన ప్రమాణం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దాదాపు 16 నిమిషాలపాటు జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. నేషనల్ మాల్‌లో కిక్కిరిసిన ప్రజలపై వర్షపు చినుకులు పడుతుండగా, ‘వాషింగ్టన్ డీసీ నుంచి మళ్లీ మీకే అధికారాన్ని బదిలీ చేస్తున్నా’ అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలే పాలకులైన రోజుగా జనవరి 20 చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
ఈ విజయం అమెరికన్లదని, ప్రజలు మళ్లీ అధికారం సాధించుకున్న రోజని తెలిపారు. మీరు, మేము అంతా కలిసి అమెరికాకు, ప్రపంచానికి ‘రాబోయే ఎన్నో ఏళ్లపాటు’ గమనాన్ని నిర్దేశిద్దామని ప్రకటించారు. ‘‘ఈరోజు నుంచి అమెరికాకే అగ్ర తాంబూలం. ఒకటే దేశం.. ఒకటే హృదయం. ప్రతి నిర్ణయాన్ని అమెరికా కుటుంబాలు, కార్మికులకు లబ్ధి చేకూర్చేలాగే తీసుకుంటాం. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం ఉంది. ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురైన వారు ఇక ఎంతో కాలం నిర్లక్ష్యానికి గురికారు. ఇప్పుడు అంతా మీ మాట వింటారు. వర్ణం ఏదైనా అందరిలో దేశభక్తి ఉంది. మాటలకు కాలం చెల్లింది.. ఇక చేతలే. అందరం కలిసికట్టుగా అమెరికాను మారుద్దాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దేశాన్ని పునర్నిర్మించే బృహత్కార్యంలో అమెరికన్లంతా చేతులు కలిపారని చెప్పారు. కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకుందామని పిలుపునిచ్చారు. తన పాలనకు ‘అమెరికా ఫస్ట్’ అన్నదే కీలక మంత్రమని, మన కలలను మళ్లీ వెనక్కి తెస్తానని, దేశాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి దేశంలో స్థానం లేదని, భూమిపై నుంచి దానిని పూర్తిగా నిర్మూలిస్తానని ప్రతినబూనారు. అదే సమయంలో, తన పాలనను ఇతర దేశాలపై రుద్దేది లేదని స్పష్టం చేశారు. ‘‘సుదీర్ఘకాలంగా, అమెరికా రాజధానిలోని ఓ చిన్న బృందం మాత్రమే ప్రభుత్వ ఫలాలను అందుకుంది. అందుకు భారాన్నంతా ప్రజలు భరించారు. వాషింగ్టన్ వెలిగిపోయింది. కానీ, ఆ సంపదను ప్రజలకు పంచలేదు.
రాజకీయ నాయకులు కుబేరులయ్యారు. కానీ, ఉద్యోగాలు కల్పించలేదు. ఫ్యాక్టరీలను మూసివేశారు. అధికార యంత్రాంగం తనను తాను కాపాడుకుంది. కానీ, దేశ ప్రజలను వదిలేసింది. వారి విజయాలు మీ విజయాలు కాలేదు. వారి గెలుపు మీ గెలుపు కాలేదు. మన దేశ రాజధానిలో వాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాలు సంబరాలు చేసుకోలేదు. కానీ, మేం అధికారాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికా ప్రజలకు తిరిగి బదిలీ చేస్తున్నాం’’ అని ప్రకటించారు. అమెరికాను పట్టి పీడిస్తున్న గన్ కల్చర్, డ్రగ్స్, నేరాలు, హింస తదితర అమెరికన్ మారణహోమం ఇప్పటికిప్పుడే, ఇక్కడికక్కడే ఆగిపోవాలని వ్యాఖ్యానించారు. అన్ని మార్పులు ఇక్కడే, ఇప్పుడే ప్రారంభం కావాలని, ఎందుకంటే, ఇది మీ సమయమని చెప్పారు. ఇక కార్యాచరణకు సమయం ఆసన్నమైందన్నారు. ఉత్తుత్తి మాటలకు కాలం చెల్లిందని, ఇక చేతలేనని చెప్పారు. విభజన గాయాలను మాన్పించే సరికొత్త దేశ గౌరవానికి ట్రంప్ హామీ ఇచ్చారు. దేశాన్ని ఐకమత్యం చేయడానికి ప్రభుత్వాన్ని ఏ పార్టీ నియంత్రిస్తోందన్నది ముఖ్యం కాదని, ప్రభుత్వాన్ని ప్రజలు నియంత్రిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు.
ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురైన వాళ్లు ఇక నిర్లక్ష్యానికి గురి కారని చెప్పారు. ‘‘మనది ఒకటే దేశం. వారి బాధ మన బాధే. వారి కలలు మన కలలే. వారి విజయం మన విజయమే. మనది ఒకటే హృదయం. ఒకటే ఇల్లు. మనది దివ్యమైన భవితవ్యం. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. నిజానికి అది అమెరికన్లు అందరికీ రాజభక్తి కలిగి ఉంటాననే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలపాటు అమెరికా పరిశ్రమను పణంగా పెట్టి అమెరికన్లు విదేశీ పరిశ్రమలను పెంచిపోషించారని, మన సొంత మిలటరీని అత్యంత దారుణంగా ఖాళీ చేసి, ఇతర దేశాల సైన్యానికి సబ్సిడీలు ఇచ్చారని, మన సొంత సరిహద్దును వదిలేసి ఇతర సరిహద్దులకు కాపలా కాశారని, అమెరికాలో మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోతే, విదేశాల్లో కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గత ప్రభుత్వాల తీరును ట్రంప్ తప్పుబట్టారు. మన దేశ సంపద, బలం, విశ్వాసం కనుమరుగు అయిపోతూ ఉంటే ఇతర దేశాలను మనం బలోపేతం చేశామని విమర్శించారు.
Comments
Post a Comment