టీఆర్‌ఎస్ ప్రచారానికి వేదికైన అసెంబ్లీ
టీఆర్‌ఎస్ ప్రచారానికి వేదికైన అసెంబ్లీ
- ఏ అంశంపైనా అర్థవంతమైన చర్చ జరగలేదు
- అయినా హరీశ్‌రావు గొప్పలు చెప్పుకొంటున్నారు
- జానారెడ్డి శభాష్ అనలేదు: భట్టి విక్రమార్క
హైదరాబాద్:శీతాకాల అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్.. ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సమావేశాలు 18 రోజులు జరిగినా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చ జరిగేందుకు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా అధికార పక్షం సమాధానం చెప్పలేదని అన్నారు. అయినా.. తెలంగాణ అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ మంత్రి హరీశ్‌రావు గొప్పలు చెప్పుకొంటున్నారని భట్టి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘సభ మొత్తం 94.56 గంటలు జరిగింది. ఇందులో సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్ సభ్యులు 50.49 గంటలు మాట్లాడారు. సభలో టీఆర్‌ఎస్ ఫ్రెండ్లీ పార్టీలు బీజేపీ, ఎంఐఎం మాట్లాడిన సమయం పోను కాంగ్రె్‌సకు ఇచ్చింది కేవలం 19 గంటలే. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును చూసి నవ్వాలో, ఏడవాలో కూడా అర్థంకావడంలేదు.’ అని భట్టి వ్యాఖ్యానించారు.
మంత్రుల పేరిట.. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావే సభలో మాట్లాడారని ఆరోపించారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి మీరిచ్చే గౌరవం? అని ప్రశ్నించారు. రుణమాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు నిధులివ్వబోమని, తమ విధానమింతేనని సభ సాక్షిగా సీఎం ప్రకటించారని భట్టి పేర్కొన్నారు. మిషన్ భగీరథపై సభాసంఘాన్ని నియమించాలన్నా, అవకతవకలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలన్నా స్పందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లిన అంశంపై సబ్‌ప్లాన్ స్టేట్ కమిటీకి చైర్మన్ హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ సమాధానం చెప్పకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్లు వేయకుండానే రూ.100 కోట్ల బిల్లు కాజేసిన అంశంపై మంత్రి కేటీఆర్ నుంచి సమాధానం రాలేదని, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ విషయంలో ప్రశ్నిస్తే పారిపోయిందని భట్టి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నిర్వహించిన తీరును ప్రతిపక్ష నేత జానారెడ్డి శభాష్ అనలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వానికి సహకరించినా అర్థవంతమైన చర్చ నిర్వహించటంలో సర్కారు విఫలమయిందని జానారెడ్డి అన్నారని చెప్పారు.
Comments
Post a Comment