జిల్లా కేంద్రానికి విమానయోగం..


: జిల్లా కేంద్రానికి త్వరలోనే విమానయాన సౌకర్యం కలుగనుంది. దేశ వ్యాపితంగా చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాంతీయ విమానాయాన అనుసంధాన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరడంతో జిల్లా ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర వ్యాపితంగా 12్ర పాంతీయ వినామాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సుముఖంగా ఉండటంతో హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల లోపు ఉన్న జనగామ జిల్లాలో మినీ ఎయిర్‌పోర్టుకు అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట-సిద్ధిపేట రహదారికి మధ్యలో నాలుగు రాష్ర్టాలకు కూడలిగా ఉండే జనగామ జిల్లా కేంద్రంలో మినీ ఎయిర్‌పోర్టుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్‌కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉండే జనగామలో చిన్న విమానాశ్రయం నిర్మిస్తే పట్టణ రూపురేఖలు వేగంగా మార్పు చెందే అవకాశముంది. జిల్లా కేంద్రం పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి చంపక్‌హిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉంది. ఇది పట్టణానికి అతి సమీపంలో శివారు ప్రాంతం. ఇప్పటికే కొంత భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించగా, వివిధ వర్గాలకు కేటాయింపులు జరిపిన భూములుతోపాటు 99ఏళ్ల లీజుకు తీసుకున్న సంస్థ నుంచి కూడా ప్రభుత్వ తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. చంపక్‌హిల్స్ ప్రాంతం చుట్టుపక్కల చిన్న విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములకు తోడు ప్రైవేట్ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే దుండిగల్ విమానాశ్రయం నుంచి శిక్షణ విమానాలు, నేవీ హెలికాప్టర్లు ఎక్కువ శాతం జనగామ ప్రాంతం మీదుగా పయనిస్తూ శిక్షణ తీసుకుంటారు. వరంగల్ మామునూరు సహా రాజధానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న జనగామ వద్ద చిన్న విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన గతంలో ఉన్నా సీమాధ్ర పాలనలో కేవలం ప్రతిపాదన దశలోనే కొట్టిపారేశారు.
తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడడం విమానయాన అనుసంధాన పథకంలో జిల్లాలకు విమానాశ్రయాలు మంజూరు చేస్తామని చెప్పడంతో జనగామకు విమానయోగం అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు కేవలం 150 నుంచి 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే సరిపోతుంది. ఇటు సిద్ధిపేట, అటు సూర్యాపేట జిల్లాలకు సమీపంలో ఉండే చంపక్‌హిల్స్ ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. భూసేకరణ లేకుండానే చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా ఇక్కడ భూమి అందుబాటులో ఉంది. లింగాలఘనపురం ప్రాంతంలో కూడా భూములు అందుబాటులో ఉన్నా, రెండు హైవేలు, నాలుగు రాష్ర్టాలకు అనుసంధానంగా ఉండే ప్రాంతంలోనే చిన్న విమానాశ్రయం ఏర్పాటయ్యే వీలుంటుంది.
ప్రైవేట్ భూముల సేకరణకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతుండడం, పరిహారం చెల్లింపుల్లో చిక్కులతో ప్రభుత్వం సైతం అందుబాటులో ఉన్న భూమి ఉన్న చోటనే ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మొగ్గుచూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో 20 ఎకరాలను మించకుండా ఉండేలా చూసుకోవాలని కూడా ప్రతిపాదనల్లో నిర్ధేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో త్వరలో విమానాశ్రయ ఏర్పాటు ఎక్కడైతే బాగుంటుందనేది స్పష్టత రావ చ్చు. లింగాలఘనపురం, జనగామ చంపక్‌హిల్స్ ప్రాంతాల్లో ఎక్కడ మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటైనా జిల్లా మొత్తానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే లింగాలఘనపురం మండలం కల్లెం వద్ద ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడం, ఇప్పటికే వరంగల్-హైదరాబాద్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా చేయాలనే ప్రతిపాదన ఉండగా, తాజాగా ప్రాంతీయ విమానాశ్రయ ప్రాతిపాదన తెరపైకి రావడంతో కొత్తగా అవతరించిన జనగామ జిల్లాకు మహర్దశ పట్టబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్, అటు మినీ ఎయిర్‌పోర్టు ఏర్పడితే జనగామ ప్రాంతం వ్యవసాయ, పారిశామ్రిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. దీనికితోడు ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది యువకులకు దేశవిదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, ఇతర వృత్తుల్లో నిపుణులుగా కొనసాగుతున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ మంది ప్రయాణికులతో నడిచే విమానాలు ప్రస్తుతం లాభసాటిగా నడిచే వీలుంటుంది. హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడంతోపాటు ఈప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Post a Comment