మళ్లీ గర్జించిన రిలయన్స్‌

 

మరో బిలియన్‌ డాలర్ల త్రైమాసికం 
రూ.8022 కోట్లకు నికర లాభం 


మా రిఫైనింగ్‌ వ్యాపారం వరుసగా 8 త్రైమాసికాలుగా రెండంకెల స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌)ను సాధించింది. రవాణా ఇంధనానికి అంతర్జాతీయంగా గిరాకీ పెరగడం ఇందుకు కారణం. నిర్వహణ పనితీరులో నాణ్యత, భారత్‌కు అనుగుణంగా మా వ్యాపార పోర్ట్‌ఫోలియోలు ఉండడం వల్ల ఎన్నో సవాళ్లు ఎదురైనా మరో సారి రాణించాం.
- ఫలితాల వెల్లడి సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి
ముకేశ్‌ అంబానీ
దిల్లీ: అంచనాలను మించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాణించింది. డిసెంబరు 31, 2016తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్‌ నికర లాభం రూ.8022 కోట్లుగా నమోదైంది. రిఫైనింగ్‌ వ్యాపారం రాణించడం ఇందుకు దోహదం చేసింది. విశ్లేషకులు అంచనా వేసిన రూ.7856 కోట్ల కంటే లాభం అధికంగా నమోదు కావడం విశేషం. అంతక్రితం త్రైమాసికం(జులై-ఆగస్టు 2016-17)లో కంపెనీ నికర లాభం రూ.7704 కోట్లుగా ఉండగా.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో లాభం రూ.7296 కోట్లు కావడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ.63,406 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.69,631 కోట్లకు చేరింది.
సోమవారం ట్రేడింగ్‌ అనంతరం కంపెనీ ఫలితాలు ప్రకటించింది. అందులో ముఖ్యాంశాలు..
ఏకీకృత నికర లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 3.6 శాతం వృద్ధి చెంది రూ.7506 కోట్లుగా నమోదైంది. ట్రెజరీ ఆదాయాలు భారీగా పెరగడం ఇందుకు కారణం. అంతక్రితం లాభం రూ.7245 కోట్లుగా ఉంది.
మొత్తం టర్నోవరు: ఇది 16 శాతం పెరిగింది. రూ.72,513 కోట్ల నుంచి రూ.84,189 కోట్లకు చేరింది. రిఫైనింగ్‌, పెట్రో రసాయనాల ఉత్పత్తుల ధరలు (ముఖ్యంగా బ్రెంట్‌ ముడి చమురు ధరలు 13%) పెరగడంతో ఆదాయం అధికమైంది. రిటైల్‌ వ్యాపారంలో భారీ వృద్ధి ఇందుకు సహకరించింది.
స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌)లు: ఒక్కో బారెల్‌కు 10.8 డాలర్ల చొప్పున స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ను దక్కించుకుంది. 2015-16 మూడో త్రైమాసికంలో ఇది 11.5 డాలర్లుగా ఉంది.
పెట్రో రసాయనాల వ్యాపారం: డిసెంబరు త్రైమాసికంలో ఈ విభాగం 17.8 శాతం వృద్ధితో రూ.22,854 కోట్లను ఆర్జించింది.
కేజీ-డి6 నుంచి ఉత్పత్తి: కేజీ-డి6 క్షేత్రం నుంచి కంపెనీ 0.26 ఎమ్‌ఎమ్‌బీబీఎల్‌(మిలియన్‌ బారెళ్లు) ముడి చమురును; 24.4 బీసీఎఫ్‌(బిలియన్‌ఘనపుటడుగులు) సహజ వాయువును ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి వరుసగా 28%, 29% చొప్పున క్షీణించినట్లయింది.
నిర్వహణ లాభం: ఇతర ఆదాయం, తరుగుదలకు ముందు నిర్వహణ లాభం 2.7 శాతం పెరిగి రూ.11,552 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది అక్టోబరు-డిసెంబరులో ఇది రూ.11,248 కోట్లుగా నమోదైంది.
మూలధన వ్యయం: మూడో త్రైమాసికానికి రూ.37,791 కోట్ల మూలధన వ్యయం నమోదైంది. ఇక డిసెంబరు 31, 2016తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి మూలధన వ్యయం రూ.81,691 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిఫైనింగ్‌ వ్యాపారం, షేల్‌ గ్యాస్‌ ప్రాజెక్టులు, డిజిటల్‌ సేవల వ్యాపార విస్తరణల కోసం వీటిని వినియోగించారు.
ఎగుమతులు, ఇతరాదాయం: భారత్‌ నుంచి ఎగుమతుల ద్వారా ఆదాయం 4% పెరిగి రూ.38,038 కోట్లకు చేరాయి. ఇతరాదాయం రూ.2736 కోట్లకు; వడ్డీ వ్యయాలు రూ.1209 కోట్లకు చేరాయి.
అప్పులు: డిసెంబరు 31, 2016 నాటికి కంపెనీ రుణాలు రూ.1,94,381 కోట్లకు చేరాయి. మార్చి 31, 2016 నాటికి ఇవి రూ.1,80,388 కోట్లుగా ఉన్నాయి.
7.24 కోట్లకు జియో వినియోగదార్లు
కేవలం నాలుగు నెలల్లో మొత్తం వినియోగదార్లు 7.24 కోట్లకు చేరారని కంపెనీ తెలిపింది. అంతర అనుసంధాన సామర్థ్యం విషయంలో ఇతర ఆపరేటర్లు ఇప్పటికీ అవసరమైన దాని కంటే తక్కువగానే పోర్టులు ఇస్తున్నారని ఆరోపించింది. జియో నుంచి ఎయిర్‌టెల్‌కు వెళ్లే ప్రతి 1000 కాల్స్‌లో 175 కాల్స్‌ విఫలమవుతున్నాయని పేర్కొంది. ‘వినియోగదార్ల నుంచి భారీ స్పందన వస్తుండడంతో.. డిజిటల్‌ సేవలకు గిరాకీ పెరుగుతోంది. వీటిని అందిపుచ్చుకోవడానికి నెట్‌వర్క్‌ కవరేజీ, సామర్థ్యాలను పెంచుకోవడానికి అదనంగా పెట్టుబడులు పెట్టాల’ని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'