రాహుల్‌కి కొత్త కుర్తా పంపిన కర్నాటక బీజేపీ కార్యకర్తలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు కర్నాటక బీజేపీ కార్యకర్తలు వినూత్నంగా స్పందించారు. చిరిగిన కుర్తాను రాజకీయాలకు వాడుకుందామనుకున్న మూడురోజులకే ఆయనకు చెక్ పెట్టేందుకు కొత్త కుర్తా సిద్ధం చేసి పంపించేశారు! ‘‘రాహుల్ గాంధీ 40 రోజుల క్రితం బ్యాంకు నుంచి రూ.4 వేలు విత్‌డ్రా చేశారు. మళ్లీ బ్యాంకులకు వెళ్లలేదు. కాబట్టి ఆయనకు కొత్త కుర్తా కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. అందుకని మా యువమోర్చా నుంచి ఆయనకు కొత్త కుర్తా కుట్టించి పంపించాం. ఆయన చేష్టలకు ముందు ముందు ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని హవేలీ యువమోర్చా నాయకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. మూడురోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సభలో తన చిరిగిన కుర్తా చూపిస్తూ.. ప్రధాని మోదీని ప్రజలు ఎప్పుడూ చిరిగిన బట్టలతో చూడలేరంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ఇప్పటికే ట్విటర్లో నెటిజన్లు రకరకాల జోకులతో హోరెత్తిస్తున్నారు కూడా. పెద్దనోట్ల రద్దు సందర్భంగా రాహుల్ గాంధీ ఏటీఎం వద్ద లైన్లో నిలబడి నిరసన తెలపడంతో... ఆయనకు రూపాయి కాయిన్లు పోగుచేసి పెద్ద ఎత్తున చిల్లర పంపిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
Post a Comment