ట్రాయ్, ఫేస్‌బుక్‌కు సుప్రీం నోటీసులు
AMR న్యూస్ తెలంగాణ/దిల్లీ: వాట్సాప్‌లో ప్రైవసీకి సంబంధించిన కేసులో కేంద్రం, టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్), వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో డేటా భద్రత లేకపోవడం, వినియోగదారుడి ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న అంశంపై పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో కలగజేసుకుని తన సహకారాన్ని అందించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ఆదేశించింది. కర్మన్య సింగ్, శ్రేయా సేథి అనే ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని మార్పు చేసింది. వినియోగదారుల అనుమతితో వారి ఖాతా సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునే విధంగా పాలసీని మార్చింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై గతేడాది సెప్టెంబర్‌లో విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు వాట్సాప్ ఖాతా డిలీట్ చేసేవారి సమాచారాన్ని వెంటనే డిలీట్ చేయాలని, సమాచారాన్ని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకోవద్దని వాట్సాప్‌కు సూచించింది.
Comments
Post a Comment