నింగికెగిసే సంబురం!

 నేడు ఓరుగల్లులో అంతర్జాతీయ పతంగుల పండుగ 


AMR NEWS TELANGANA/ WARANGAL INCHARGE:
ఓరుగల్లుకు పండగొచ్చింది. అది ఎప్పుడూ వచ్చేది కాదు. ఎంతో ప్రత్యేకమైనది. గతంలో కనీవినీ రీతిలో జరగనిది. మంగళవారం చారిత్రక నగరంలో అంతర్జాతీయ పతంగుల వేడుక అబ్బురపరచనుంది. హన్మకొండలోని ఆర్స్ట్‌ కళాశాల మైదానం ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ప్రాంతమంతా వింత వింత గాలిపటాలతో గమ్మత్తు గొలిపే ఆకారాలతో రంగులమయం కాబోతోంది. పతంగులు ఎగరేయడానికి ఎక్కడెక్కడి దేశాల నుంచో విదేశీ అతిథులు వచ్చారు. పర్యాటక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వారం రోజులుగా వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకే చారిత్రక వరంగల్‌ కోటలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తారు. 9.30కి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో పతంగుల పండుగను లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదట 31 దేశాల నుంచి వచ్చిన నిపుణులు గాలిపటాలను ఎగురవేసి సందడి చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి స్థానికులు అవకాశం ఇస్తారు. ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించిన నేపథ్యంలో పతంగుల పండుగ ప్రచారం కోసం వస్త్ర బ్యానర్లను తయారు చేయడం విశేషం.
అలరించనున్న కార్యక్రమాలు
మైదానంలో ఆహూతులను అలరించడానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఒకవైపు పతంగులు ఎగరుతుంటే మరో వైపు కళాకారులు తమ ఆటపాటలతో మరింత వినోదాన్ని పంచనున్నారు. మైదానం చుట్టూ ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పసందైన రుచులతో వివిధ రకాల వంటకాల్ని అందుబాటులో ఉంచుతారు. సందర్శకులకు ప్రత్యేక గ్యాలరీని రూపొందించారు. సాయంత్రం 5 గంటలకు కైట్‌ ఫెస్టివల్‌ ముగుస్తుంది.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'