హైదరాబాద్‌లో ప్రతీ ఇంటికీ డిజిటల్ బోర్డులు
హైదరాబాద్‌లో ప్రతీ ఇంటికీ డిజిటల్ బోర్డులు
- ఇంటినెంబర్లపై ప్రకటనలు
మహా నగరంలో చిరునామా కనుక్కోవడం అంత సులువు కాదు. ఏళ్ల తరబడి సిటీలో ఉండే వారు కూడా ఇంటి నెంబర్ల సహా అడ్రస్ చెప్పే పరిస్థితి ఉండదు. జిల్లాల నుంచి వచ్చిన వారి పరిస్థితీ అంతే. గజిబిజిగా మారిన చిరునామా చిక్కులకు చెక్ పెట్టేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించకపోవడం, ఇతరత్రా కారణాలతో ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడా ఇబ్బందులు అధిగమించేలా డిజిటల్ ఇంటి నెంబరింగ్ ప్రక్రియ ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. నిధుల ఇబ్బందులు లేకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్ :త్వరలో డిజిటల్ నెంబర్‌రింగ్‌కు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. ఇప్పటికే దోమలగూడ, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో జిప్పర్ అనే సంస్థ పైలట్ ప్రాజెక్టుల ద్వారా డిజిటల్ ఇంటి నెంబర్లను గుర్తించింది. ఇది సత్ఫలితాలనివ్వడంతో నగరం మొత్తం విస్తరించాలని నిర్ణయించారు. ప్రాంతం, కాలనీ, వీధి, ఇంటి నెంబర్ స్పష్టంగా సూచించేలా ఇంటి నెంబరింగ్ ఉంటుంది. రెండు దశాబ్దాల్లో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చిన్న ఇళ్ల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు, మాల్స్ వెలిశాయి. విస్తరణ క్రమంలో భౌగోళిక స్వరూపంలో క్రమేణా మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అడ్రస్ కనుక్కోవడం కష్టంగా మారుతోంది. నగరంలోని మెజార్టీ ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటి నెంబర్ల కేటాయింపు మున్ముందు కూడా సమస్య పరిష్కారానికి ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్థిక భారం లేకుండా...
ఆర్థిక భారం లేకుండా డిజిటల్ నెంబరింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. పీపీపీలో ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంటి నెంబర్లతో కూడిన బోర్డులను ప్రకటనలకు ఇవ్వడం ద్వారా ఎంపికైన సంస్థ ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధి వరకే ఆ సంస్థకు ప్రకటనల ప్రదర్శన అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత ప్రకటనల కేటాయింపు జీహెచ్‌ఎంసీ చూసుకుంటుంది. త్వరలో బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ ప్రకటించనున్నారు. తక్కువ మొత్తం, కాల వ్యవధి కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థ ముందుగా గ్రేటర్ వ్యాప్తంగా సాంకేతిక అంశాల ఆధారంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతే డిజిటల్ ఇంటి నెంబర్లు కేటాయిస్తారు.
ఇవీ ప్రయోజనాలు
- ఇంటి నెంబర్ కొడితే ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు..? ఏ మార్గంలో వెళ్లాలి..? ఎంత దూరం ఉందన్నది ఇంటర్నెట్‌లో తెల్సిపోతుంది.
- ఇంటి నెంబర్లతో పాటు వారు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నీటి, విద్యుత్ బిల్లుల వివరాలూ ఉంటాయి.
- డిజిటల్ నెంబరింగ్ ద్వారా ఆయా పన్నుల చెల్లింపు కూడా సులువవుతుంది.
సులువుగా చిరునామా
ఇంటి చిరునామాను సులువుగా గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. తేలిగ్గా చిరునామాను గుర్తుంచుకునేందుకు వీలుగా రెండు నుంచి నాలుగు ఆంగ్ల అక్షరాలు, నాలుగు నెంబర్లతో కొత్త చిరునామాలు ఉండనున్నాయి. కాలనీ, వీధి పేరును సూచించేలా ఆంగ్ల అక్షరాలు, ఇంటి చిరునామా తెలిపేలా నెంబర్లు ఉంటాయి. భవనాల చిత్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌లోని ప్రధాన, అంతర్గత రహదారుల వివరాలను ముందే శాటిలైట్ చిత్రాల ద్వారా నిక్షిప్తపరుస్తారు. జియో ట్యాగింగ్‌తో చిరునామా సులువుగా తెల్సుకునేలా అభివృద్ధి చేస్తారు. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షించే ప్రస్తుత కాలంలో ఇంటి అడ్ర్‌సను ఇట్టే తెల్సుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. ఒక్కో భవనానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించనున్నారు.
వ్యక్తి వివరాల్లో ఇంటి అడ్రస్ పొందుపరిస్తే..
ఆ తరువాత అతని ఓటర్ గుర్తింపు కార్డు, సోషల్ సెక్యురిటీ కార్డుల వివరాలు కూడా తెల్సుకోవచ్చు. ఇతరత్రా అవసరాలకు డిజిటల్ ఇంటి నెంబర్ నావిగేషన్ టూల్‌లా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాలంలో సెర్చ్ చేసినా ఇంటి అడ్రస్ భవనం సహా స్పష్టంగా తెలిసిపోతుంది. గ్రేటర్‌లో 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. నివాస, వ్యాపార, వాణిజ్య భవనాలు 10 లక్షలలోపే ఉంటాయి. వీటన్నింటికి డిజిటల్ నెంబరింగ్ కేటాయింపునకు కసరత్తు జరుగుతోంది.
Comments
Post a Comment