అధికార దర్పానికి ఎర్రలైటు!
అధికార దర్పానికి ఎర్రలైటు!
‘రాజు వెడలె రవితేజములలరగ’ అనిపించుకోవాలన్న యావ లావైన రాజకీయ నేతలు, అధికార గణాల ఉరవడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాస భాజనం చేస్తోంది. ఏటికేడు జడలు విరబోసుకొంటున్న వీఐపీ సంస్కృతి వికృతత్వం- ఎక్కడికక్కడ జోరెత్తుతున్న బుగ్గకార్ల సంఖ్యావివరాల్లో ప్రతిఫలిస్తోంది. కార్లపై ఎర్ర లైటు (లాల్‌బత్తి) పెట్టుకు తిరగడంవల్ల పని సామర్థ్యం ఎలా పెరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం 2013 ఆగస్టులో సంధించిన సూటిప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానం ఇచ్చినవారు లేరు. అధికార డాంబిక ప్రదర్శన చిహ్నంగా ఛీ కొట్టించుకొంటున్న లాల్‌బత్తిల వినియోగంపై మోదీ మంత్రివర్గం నిష్కర్షగా వేటు వెయ్యడాన్ని సహర్షంగా స్వాగతించాలిప్పుడు! అతి చేస్తే గతి చెడుతుందన్న నానుడికి ఎర్రబుగ్గ కార్లే సరైన ఉదాహరణ. ‘బుగ్గకారు కావాలి- బల్బు వెలిగిపోవాలి’ అంటూ సర్పంచులు సైతం లాల్‌బత్తి కార్ల కోసం వెంపర్లాడటాన్ని న్యాయపాలిక లోగడే ఈసడించింది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కొన్ని ప్రతిపాదనల్ని వారం రోజుల క్రితమే ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. లాల్‌బత్తి వినియోగానికి పూర్తిగా మంగళం పాడాలన్నది మొదటిది కాగా- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా రాజ్యాంగ పదవుల్లో ఉన్న అయిదుగురికే వాటిని పరిమితం చెయ్యాలన్నది మరొకటి. పంజాబులో అమరీందర్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు కార్లపై ఎర్రబుగ్గల వినియోగాన్ని ఇప్పటికే నిషేధించాయి. మంత్రులు ఎర్రబుగ్గ కార్లను వినియోగించరాదని దిల్లీ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వమూ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో- మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు విస్తృత సవరణల ద్వారా వచ్చే నెల ఒకటినుంచి దేశవ్యాప్తంగా ఎర్రబుగ్గ కార్ల వినియోగాన్ని కేంద్ర మంత్రివర్గం పూర్తిగా నిషేధించింది. తన వాహనంపైనా లాల్‌బత్తి ఉండబోదన్న ప్రధాని మోదీ నిర్ణయం- పదవీ పటాటోప ప్రదర్శన పిపాసులకు కనువిప్పు కావాలి!

కూడలిలో ఎర్రలైటు పడితే ఆగాలి. లాల్‌బత్తి వెలుగు జిలుగులతో సైరన్ మోతతో దూసుకొచ్చే వాహనాలకు దారి వదలాలి. రాష్ట్రాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి అత్యంత ప్రముఖుల వినియోగానికే పరిమితం కావాల్సిన ఎర్రబుగ్గలు- మోటారు వాహనాల చట్టం (1988)లోని 108వ నిబంధన దుర్వినియోగం కారణంగా వందలమంది ‘పెద్దల’ దర్పాన్ని ప్రదర్శించేవిగా భ్రష్టుపట్టాయి. లాల్‌బత్తీలను అత్యంత ప్రముఖులే వినియోగించాలంటున్న చట్టం, వారి జాబితా కూర్పు అధికారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టడంతో ఆ చిట్టాలో చొరబాట్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. జస్టిస్ మార్కండేయ కట్జూ అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన సారథ్యంలోని ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తులకు ఎర్రబుగ్గ కార్లు కేటాయించాలని ఆదేశించింది. ఎర్రబుగ్గల కోసం వేలంవెర్రి శ్రుతి మించుతోందంటూ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు 2013లో విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ‘అత్యంత ప్రముఖు’లన్న పదమే రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టు సహాయకుడిగా హరీశ్ సాల్వే ప్రస్తావించిన సందర్భంలో- అందులోనూ మినహాయింపులు ఇచ్చిన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లపై నాడు సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. రాష్ట్రాల సమ్మతి కోసం వేచిచూడకుండానే కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చునన్న న్యాయపాలిక- ఆంబులెన్సులు, అగ్నిమాపక సేవలు, పోలీసు, సైనిక వాహనాలకు మాత్రమే మినహాయింపులు ఉండాలని తీర్మానించింది. నాటి ‘సుప్రీం’ తీర్పు స్ఫూర్తికి ఎత్తుపీట వేస్తూ ప్రధాని మోదీ తీసుకొన్న నిర్ణయం- సాధారణ ప్రజల్ని రెండో తరగతి పౌరులుగా స్థిరీకరిస్తున్న వికృత వీఐపీ సంస్కృతిపై ఎత్తిన కత్తిగా స్వాగతించాలి!
‘రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు లాల్‌బత్తి వాహనాల్ని వినియోగించడంలో ఎప్పుడూ సాటి పౌరులు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించరాదు; లేదా తక్కినవారి కంటే తాము అధికులమని భావించనూ రాదు. అధికారంలో ఉన్నంతకాలమే, అదీ విధుల్లో ఉన్నప్పుడే ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవా’లన్న సుప్రీం ఆదేశాల్లో చట్టం ముందు అందరూ సమానమేనన్న స్ఫూర్తి పరిమళించింది. ఎర్రబుగ్గ వాహనాలు వాడే ప్రముఖుల సంఖ్యను హేతుబద్ధీకరించాలన్న 2015 నాటి ఆదేశాలకు ఇప్పటికి మోక్షం దక్కింది. లాల్‌బత్తి వాహనాలే కాదు- సర్కారీ భద్రతనూ పొందడం తమ గౌరవ, హోదా చిహ్నంగా భావించేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న దేశం మనది. భారత్‌లో ఉన్నంతమంది కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన వీఐపీలు ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రిటన్ 84, ఫ్రాన్స్ 109, జపాన్ 125, అమెరికా 252, చైనా 435 మందిని అధికారిక వీఐపీలుగా గుర్తిస్తే ఇండియాలో వారి సంఖ్య 450 దాటిపోయింది! వలస పాలకుల కాలంనాటి భేషజాలకు ప్రతీకలుగా లాల్‌బత్తీలు, సర్కారీ భద్రతా ఏర్పాట్లు నేటికీ కొనసాగుతున్నాయి. బుగ్గ కార్లలో ప్రముఖులు వెళ్ళని సందర్భాల్లో లైటు కనపడకుండా నల్ల కవరు కప్పి ఉంచాలన్న సూచనలు కొల్లబోతున్నాయి. కార్లపై ఎర్రలైటు పెట్టుకొని దర్జాగా నేరాలకు పాల్పడుతున్న ఘటనలూ నమోదవుతున్నాయని న్యాయపాలికే హెచ్చరించగా, ఎర్రలైట్లను అద్దెకిచ్చే వైనాలు తెలుగు గడ్డమీదే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చట్టం ముందు అందరూ సమానమేనన్న రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి మన్నన దక్కించినందుకు మోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి. పనిలో పనిగా, ‘ప్రముఖుల’ వ్యక్తిగత భద్రతకు ప్రాతిపదిక అవుతున్న దుర్రాజకీయ కోణాల్నీ సత్వరం పరిహరించాలి!
Comments
Post a Comment