12 ఏళ్లలో 11 ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్‌

12 ఏళ్లలో 11 ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంసెట్‌-2(2016) మెడికల్‌ ప్రవేశ పరీక్ష పత్రం లీకేజీ సూత్రధారి శివ్‌బహదూర్‌సింగ్‌ (ఎస్‌బీ సింగ్‌) ఆ వ్యవహారాల్లో ఆరితేరినట్లు వెల్లడైంది.12ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 11 ప్రవేశపరీక్షల పేపర్లు బయటకు తీసుకువచ్చి సొమ్ముచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎనిమిది రాష్ట్రాల్లో కీలకంగా భావించే పరీక్షలతో పాటు కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ఇండియా పరీక్ష కేసులోనూ భాగస్వామ్యం ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. స్థిరాస్తి వ్యాపారం(ప్రాపర్టీ డీలర్‌)చేసే ఆయన మరింత ఆదాయం కోసం లీకేజీ బాట పట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎంసెట్‌ లీకేజీ కేసులో కీలక నిందితుడైన ఎస్‌బీ సింగ్‌ను, అతని సహాయకుడు అనూప్‌ కుమార్‌ సింగ్‌ (సోని)ను తెలంగాణ సీఐడీ పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో అరెస్టు చేశారు. వీరిద్దరినీ వారెంటు కింద బుధవారం హైదరాబాద్‌ తీసుకువచ్చారు. శివ్‌బహదూర్‌సింగ్‌ ఎంసెట్‌ లీకేజీలో ప్రధాన సూత్రధారి అని తెలంగాణ సీఐడీ అదనపు డీజీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌2 మెడికల్‌ ప్రశ్నపత్రాన్ని తనకు ఉన్న పరిచయాల ద్వారా బయటకు తీసుకువచ్చారు. పరీక్షపత్రాల లీకేజీ కుట్రల్లో 2005 నుంచి ఉన్నారని సీఐడీ గుర్తించింది.
మరిన్ని కేసుల్లో ప్రమేయం?
నిందితులకు మరిన్ని లీకేజీ కేసులతో ప్రమేయమున్నట్లు సీఐడీ భావిస్తోంది. వీరిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి, పోలీసు కస్టడీకి తీసుకోవాలనుకుంటోంది. ప్రింటింగ్‌ ప్రెస్‌లో పేపర్లు ముద్రిస్తున్నట్లు సమాచారం ఎలా వచ్చింది? అక్కడ ప్రధాన నిందితులు ఎవరు? అన్న వివరాలను రాబట్టనుంది. లోతైన విచారణ చేస్తే వివిధ రాష్ట్రాల్లో ఎన్ని పేపర్లు లీకయ్యాయి? ఎవరెవరి హస్తముంది? తదితర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు సీఐడీ అంచనా.
ఎస్‌బీ సింగ్‌ ప్రమేయమున్న లీకేజీ కేసులు..
* ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో రైల్వే గ్రూప్‌-డీ ప్రశ్నపత్రం.
* 2008లో అలహాబాద్‌లో రైల్వేడ్రైవర్ల పరీక్ష పత్రం
* 2015లో పంజాబ్‌ రాష్ట్రంలో జరిగిన టెట్‌పరీక్ష పత్రం కేసుతో పాటు పీఎస్‌సీ పరీక్షలు
* 2015లో జమ్ముకశ్మీర్‌ ఉపాధ్యాయ పరీక్ష పత్రం
* కోల్‌ ఇండియా పరీక్షలు
* మహారాష్ట్రలోని వార్దా మెడికల్‌ కళాశాల
* చండీగఢ్‌ ఉపాధ్యాయ పరీక్ష ప్రశ్నాపత్రం
* కోల్‌కతా టెట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం
* 2016 డిసెంబరులో దిల్లీ మెట్రోరైలుపరీక్ష పత్రం
* 2016 తెలంగాణ ఎంసెట్‌-2 (మెడికల్‌) ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'