రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం

రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం 

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ-ఈ, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీ-ఈలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆదివారం బిల్లును ప్రవేశపెట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిజర్వేషన్ల పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల సభ్యులు దీనిపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు అందించారు. భాజపా గిరిజనుల రిజర్వేషన్లకు మద్దతిస్తూనే.. ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు? వారేం పాపం చేశారు? ఈ దేశంలో ముస్లింలు పౌరులు కాదా? వారు పన్నులు కట్టడంలేదా? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కచ్చితంగా 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా చూస్తామన్నారు. కేంద్రం ఇందుకు అంగీకరించకపోతే అవసరమైతే పార్లమెంట్‌లో దీనికోసం పోరాటం చేస్తామన్నారు. వితండవాదంతో, మతం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు రిజర్వేషన్లను వ్యతిరేకించడం సరికాదన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చితీరుతామని స్పష్టంచేశారు.
వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం
రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయనీ, గతంలో పాలకులు వాటన్నింటినీ విస్మరించారన్నారు. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర హెరిటేజ్‌ బిల్లు మాత్రమే ఉండాలన్నారు. ఈ బిల్లులో ఉండాల్సిన కట్టడాలపై సీఎస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. చారిత్రక అవశేషాలను పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. గ్రీన్‌ల్యాండ్‌ గెస్ట్‌హౌస్‌ను వారసత్వ సంపద జాబితాలో చేర్చారని సీఎం తెలిపారు. జోగులంబ ఆలయాన్ని పురావస్తుశాఖకు అప్పగించారనీ, ఆ ఆలయంలో పలు సమస్యలు ఉన్నట్టు చెప్పారు. నిర్వహించలేని, కూలీపోయే వాటినీ ఈ జాబితాలో చేర్చలేమని స్పష్టంచేశారు. పరిరక్షించదగిన కట్టడాలను తప్పకుండా ఈ జాబితాలో చేర్చాలన్నారు. బిల్లు ఆమోదించి.. ప్రతిపాదనలు పంపేలోపే సమగ్రంగా దీనిపై చర్చిద్దామని సభ్యులకు సూచించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'